top of page

సోషలిజం కోసం...తొలి శ్రామిక సమరం పారిస్‌ కమ్యూన్‌ @ 150

బుడ్డిగ జమిందార్‌


ప్రపంచ మానవాళి చరిత్రలో మొట్టమొదటి శ్రామికవర్గ విప్లవానికి నేటితో 150 సంవత్సరాలు నిండాయి. పారిస్‌ కమ్యూన్‌గా పిలిచే ఈ విప్లవం 1871 మార్చి 18న జరిగింది. ఈ విప్లవం విజయ వంతమై ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మొదటిసారిగా శ్రామికవర్గం పాలించిన ప్రభుత్వం ఇది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువకాలం మనగలగ లేదు. 73 రోజుల పాలనతో మే 28 నాటి వరకు మాత్రమే నిలవగల్గింది. కమ్యూన్‌ను నిర్మించటమంటే ఒకవర్గానికి ప్రత్యా మ్నాయంగా మరొక వర్గం కాదని, వర్గరహిత సమాజమని, కమ్యూన్‌ విప్లవంలో పాల్గొన్న సైనికుడు లీసాగ్రామ్‌ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, పెట్టుబడిదారులు లేకుండా, బ్యాంకర్లు, ఆర్మీ లేకుండా పాలన సాధ్యమని పారిస్‌ శ్రామికులు, స్త్రీలు కలిసి మొదటిసారిగా నిరూపించారు. కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్లుగా కమ్యూనాడ్లు స్వర్గంలోకి చొచ్చుకొనిపోయారు.


పూర్వ పరిణామాలు


ఫ్రాన్స్‌-జర్మనీ ప్రష్యా మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్‌ను పాలిస్తున్న రాజు నెపోలియన్‌-3 (చార్లెస్‌ లూయీస్‌) 1870 సెప్టెంబరులో ఓడిపోయాడు. ఫ్రాంకో-ప్రష్యన్‌ యుద్ధం ఇంటర్నేషనల్‌కు అగ్నిపరీక్షగా మారింది. జర్మనీకి వ్యతిరేకంగా బోనపార్టీ ప్రారంభించిన ఈ యుద్ధం దారిదోపిడీ వంటిదని ఇంటర్నేషనల్‌ జనరల్‌ కౌన్సిల్‌ తరపున మార్క్స్‌ ప్రకటన చేశాడు. ఫ్రాన్స్‌- జర్మనీలకు చెందిన ఉభయ పాలక వర్గాలు ఈ యుద్ధాలకు కారణమని కనుక ఉభయ దేశాల కార్మికులు యుద్ధ్ధాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలనీ మార్క్స్‌ కోరాడు (సి.వి.రచన పారిస్‌ కమ్యూన్‌ నుండి). ఫ్రాన్స్‌ ఉత్తరభాగం సెడాన్‌లో ఓటమి తర్వాత 1870 సెప్టెంబరు 4న బోనపార్టీ అధికారాన్ని ఫ్రాన్స్‌ ప్రజలు కూలదోసారు. ఫ్రెంచ్‌ బొనాపార్టీ ద్వితీయ సామ్రాజ్యం స్థానంలో థేర్స్‌ రిపబ్లిక్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జర్మన్‌ సైన్యం పారిస్‌ ముంగిట తిష్ఠ వేసింది. బలమైన శ్రామిక, నేషనల్‌ గార్డ్స్‌ గల పారిస్‌ నగరంపై దాడి చేయటానికి జర్మనీ సంకోచించింది. ఫిబ్రవరిలో ఆడోఫే థేర్స్‌ ఫ్రెంచ్‌ జాతీయ ప్రభుత్వానికి నూతన ముఖ్య కార్యనిర్వహునిగా జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకొన్నాడు. ఆర్మీని తొలగించాడు, నేషనల్‌ గార్డ్స్‌ను మాత్రం తనతోనే ఉంచుకొన్నారు.

కమ్యూన్స్‌ నాయకత్వంలోని నేషనల్‌ గార్డ్స్‌ థేర్స్‌ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని ఎదురించాయి. శాంతి ఒప్పందం మరలా రాచరిక వ్యవస్థ వైపు వెళ్లి నిరంకుశత్వానికి దారి తీస్తుందని కమ్యూన్స్‌లోని కమ్యూనార్డ్‌ల ఆలోచన. మిలిటరీ దళాలు, నేషనల్‌ గార్డ్స్‌, 25 మంది సభ్యులతో కూడిన సెంట్రల్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఫ్రెంచ్‌ ప్రధాని థేర్స్‌ పారిస్‌ నగరాన్ని జర్మనీ ప్రధాని బిస్మార్క్‌కు అప్పగించటానికి సిద్ధమైనాడు. 1871 మార్చి 17వ తేదీ రాత్రి నేషనల్‌ గార్డ్స్‌కు చెందిన ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకోవటానికి థేర్స్‌ పథకం వేసాడు. పారిస్‌ కార్మికులు, ప్రజలు థేర్స్‌ ఎత్తుగడలను ప్రతిగటించారు. ''ఏదిఏమైనా, పారిస్‌లో ప్రస్తుతం జరుగుతున్న విప్లవాన్ని పాత వ్యవస్థకు చెందిన తోడేళ్ళు, ఊరపందులు, వీధికుక్కలు అణచివేసినా అది 1848 జూన్‌ తిరుగుబాటు తర్వాత మన పార్టీ సాధించిన మహోజ్వల కార్యం'' అని కార్ల్‌మార్క్స్‌ అన్నారు.


పారిస్‌ కమ్యూన్‌ ఘన విజయాలు


పారిస్‌ కమ్యూన్‌కు జరిగిన ఎన్నికల్లో 92 మంది సభ్యులు కౌన్సిలర్లుగా ఎన్నికైనారు. వీరిలో మార్క్సిస్టులు 18 మంది మాత్రమే ఉన్నారు. కమ్యూన్‌లో పెట్టీ బూర్జువాలు, చేతివృత్తులవారు, ప్రొథానిస్టులు ఉన్నారు. దోపిడీ పాలక వర్గాలచేతుల్లోని ఉద్యమాల అణచివేతఆయుధమైన సైన్యాన్ని కమ్యూన్‌ రద్దు చేసింది.జడ్జిలు, మెజిస్ట్రేట్లు, నిరంకుశాధికారుల్ని విధులుసక్రమంగా నిర్వహించక పోతే వారిని ప్రజలే తొలగించే హక్కును (ది రైట్‌ టు రీకాల్‌) కమ్యూన్‌ కలుగ జేసింది. కార్మికులకు ఉన్నతాధికారులకు మధ్య ఉండే విపరీతమైన జీతాల వ్యత్యాసాలను కార్మికులతో సమానంగా ఉంచింది. న్యాయవ్యవస్థపై కట్టుదిట్టాలను ఉంచి దోపిడీదార్లకు అనుకూలురుపై కన్నువేసి ఉంచింది. అధిక వ్యయానికి హేతువైన సైన్యాన్ని, నిరంకుశ ఉద్యోగ వర్గాన్ని రద్దు చేయటం ద్వారా ఖర్చులు తగ్గించటం సాధ్యమైంది. ఖర్మ సిద్ధాంతాన్ని నిత్యం వల్లిస్తూ పేదరికానికి ఇదే కారణమంటూ నిరంతరం ప్రచారం చేసే చర్చిని ప్రభుత్వం నుండి కమ్యూన్‌ వేరు చేసింది. మూఢ నమ్మకాల పేరుతో మతోన్మాదం రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకొంది. నెపోలియన్‌ సైనిక తత్వానికి చిహ్నమైన పారిస్‌ నడిబొడ్డున ఉన్న ''వెండోం'' విజయ స్థంభాన్ని కమ్యూన్‌ నిర్మూలించింది. యజమానులు కార్మికు లపై విధించే జరిమానాలను రద్దు చేసింది. కానీ వడ్డీ వ్యాపారులు ప్రామిసరీ నోట్లపై యిచ్చిన అప్పుల్ని రద్దు చేయలేదు, సులభ వాయిదాలలో మాత్రమే చెల్లించమంది. నిర్భంధ సైనిక సర్వీసు రద్దు అయ్యింది. రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. రాచరిక వ్యవస్థకు భిన్నంగా అన్ని తరగతుల ప్రజలు సాంఘిక, రాజకీయ కార్యక్రమాల్లో సమానంగా పాల్గొన్నారు. పనిగంటలు తగ్గించటం, స్త్రీకి పురుషునితో సమాన వేతన దిశగా అడుగులు వేశారు. ఒకే పనికి ఒకే వేతనం అమలు చేశారు. విప్లవ ఉద్యమానికి చిహ్నమైన ఎర్రజెండాను కమ్యూన్‌ జెండాగా స్వీకరించింది. విప్లవం ఫలితంగా పెట్టుబడిదారులు వారి పరిశ్రమలను మూసి వేసి వెర్సలీస్‌ పారిపోతే, పరిశ్రమలు ఉత్పత్తిఆగి 3లక్షలమంది నిరుద్యోగులైనారు. పరిశ్రమల్ని తెరిపించి సహకార సంఘాలను కమ్యూన్‌ ఏర్పాటు చేసింది.


పారిస్‌ కమ్యూన్‌పై మహోపాధ్యాయ లెనిన్‌ అభిప్రాయాలు


1908 మార్చి 18 నాడు లెనిన్‌ మహాశయుడు పారిస్‌ కమ్యూన్‌ను ఉద్దేశించి వ్రాసిన లేఖ ''పారిస్‌ కమ్యూన్‌ పాఠాలు'' లోని ముఖ్యాంశాలు.

పారిస్‌ కమ్యూన్‌ అకస్మాత్తుగా జరిగిన పరిణామం. ఉన్నతవర్గాలకు వ్యతిరేకంగా, శ్రామికుల మధ్య పెరిగిన నిరుద్యోగంతో, చేతివృత్తులవారు వినాశమవుతున్న దశలో, అధికారుల అసమర్థత వారి అణచివేతలకు నిరసనగా, రిపబ్లిక్‌ తన విధులను సక్రమంగా నిర్వహించని దశలో 'పారిస్‌ కమ్యూన్‌' విప్లవం జరిగింది. ఈ అపూర్వ సంఘటనకు ముందు భూస్వామ్య పెట్టుబడిదారుల చేతిలో అధికారం ఉంది. మార్చి 18 తర్వాత థేర్స్‌ ప్రభుత్వ దళాలు, పోలీసులు, అధికారులు పారిస్‌ నుండి పారిపోయారు. ప్రజలకు నాయకత్వం వహించిన కమ్యూనాడ్స్‌ చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆధునిక సమాజంలో మూలధనానికి బానిసలుగా శ్రామికులు ఉంటే శ్రామికులు రాజకీయ ఆధిపత్యాన్ని సాగించలేరు. మూలధన మూలాల గొలుసులను శ్రామికులు విచ్ఛిన్నం చేయాలి. అందుచేత కమ్యూన్‌ ఉద్యమం ఒక సోషలిస్టు సమాజ రూపం తీసుకొచ్చింది. అంటే ప్రస్తుత సామాజికక్రమం పునాదులను నాశనం చేసి బూర్జువావర్గ శక్తిని పడగొట్టటానికి కమ్యూన్‌ ఆరంభ త్యాగాలను చేసింది. ఫ్రాన్స్‌ బూర్జువావర్గం భూస్వాములు, స్టాక్‌ బ్రోకర్స్‌, కర్మాగారాల యజమానులు, దొంగలు దోపిడీదారులు పారిస్‌ కమ్యూన్‌కు మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్నారు.

సాంఘిక విప్లవానికి కనీసం రెండు షరతులు వర్తించాలి. మొదటిగా ఉత్పత్తి శక్తులు అభివృద్ది చెంది ఉండాలి. రెండవది శ్రామికవర్గం విప్లవానికి సంసిద్ధంగా తయారై ఉండాలి. కమ్యూన్‌కు ఆలోచనా శక్తికి, ప్రణాళికల అమలుకు కావల్సిన సమయం లేకుండా పోయింది. పారిస్‌కు వ్యతిరేకంగా వెర్సలీస్‌ ప్రభుత్వం మిలిటరీని రంగప్రవేశం చేయించినప్పుడు మొత్తం బూర్జువావర్గం మద్దతుగా ఉంది. కమ్యూన్లు స్వీయ రక్షణలో పడ్డారు. ముఖ్యంగా రక్తపాతం జరిగిన మే 21 నుండి 28 మధ్య కమ్యూనార్డులు తేరుకోలేకపోయారు. సమయం లేనప్పటికీ అనేక అద్భుత విజయాలను కమ్యూనార్డులు సాధించగలిగారు. విద్యను చర్చి నుండి వేరు చేసి లౌకికవాదం వైపు నడిపారు. బేకరీలలో రాత్రిపూట షిప్టు పనులను నిషేధించగలిగారు. ప్రభుత్వ అధికారుల వార్షిక ఆదాయం 6 వేల ఫ్రాంకులకు మించకుండా శాసనం చేయగలిగారు. బానిసత్వానికి, దోపిడీకి వ్యతిరేక చిహ్నంగా పారిస్‌ కమ్యూన్‌ నిలిచింది, పారిస్‌ నగర్‌ హాల్‌పై ఎర్రజెండా ఎగిరినంతకాలం బూర్జువావర్గం కంటికి నిదుర పట్టలేదు. జర్మనీ సైనికుల బూటు కాళ్ళతో తన్నించుకొని ఓడిపోయిన బొన్నాపార్టీ జనరల్స్‌ స్వదేశంలో సిగ్గు లేకుండా సొంత ఫ్రాన్స్‌దేశ కార్మికుల్ని మాత్రం ఘోరంగా చంపారు. ఆయుధాలు కల్గిన ఆర్మీ కనీసం 30 వేల కార్మికుల్ని క్రూరాతిక్రూరంగా చంపింది. 45 వేల మందిని అరెస్టు చేసి జీవిత ఖైదీల్ని చేసింది. అనేక వేలమందిని ఫ్రెంచ్‌ గయానా జైళ్లకు పంపింది. మొత్తంమీద కనీసం లక్షమందిని పొట్టన పెట్టుకుంది. బూర్జువా వర్గం సోషలిజాన్ని నిర్మూలించామని తృప్తిచెంది చంకలు ఎగరేసుకుంది. కమ్యూ నార్డులు జైళ్ళల్లో ఒకవైపు మగ్గుతూనే ఉన్నారు. మొరకవైపు 6 సంవత్సరాలు తిరగకుండానే పడిపోయిన ఎర్రజెండాను యువకులు చేబూని ''సోషల్‌ విప్లవం వర్థిల్లాలి, పారిస్‌ కమ్యూన్‌ వర్థిల్లాలి అని నినదించారు'', పారిస్‌ కమ్యూన్‌ను ఫ్రాన్స్‌లోనే గాకుండా మొత్తం యావత్తు ప్రపంచంలో కొనియాడారు. అణచి వేతదార్లకు వ్యతిరేకంగా అణగారిన ప్రజల కోసం పోరాటాలు ఉద్యమాలు విప్లవాలు ప్రారంభమైనాయి. అనతికాలంలోనే కోట్లాదిమంది ప్రపంచ జనాభా సోషలిజం కోసం ఉద్యమించారు.


శ్రామికవర్గం మాత్రమే చివరి వరకూ కమ్యూన్‌కు విధేయులుగా ఉన్నారు. బూర్జువా రిపబ్లికన్లు, పెటీ బూర్జువాలు విప్లవం నుండి వైదొలిగారు. సోషలిస్టు శ్రామిక స్వభావానికి కొందరు భయపడ్డారు. కొందరు ఓటమి అనివార్యమని ఊహించుకొని వైదొలిగారు. శ్రామికవర్గ విముక్తి కోసం శ్రమజీవులందరికి ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రామికులు ఒంటరిగా పోరాడి మరణించారు. 150 సంవత్సరాల పారిస్‌ కమ్యూన్‌ వార్షికోత్సవం సందర్భంగా మృతవీరులకు జోహార్లు.


పారిస్‌ కమ్యూన్‌ తదనంతర కాలంలో పారిస్‌ కమ్యూన్‌ నేర్పిన పాఠాల ఆధారంగా అనేక విప్లవాలు విజయవంతమైనాయి. రష్యా, తూర్పు యూరపు దేశాల్లో సోషలిస్టు రాజ్యాలేర్పడినాయి. ఫాసిజాన్ని మట్టి కరిపించి మానవాళిని కాపాడింది సోషలిస్టు సమాజం. అమెరికా సామ్రాజ్య యుద్ధ కాంక్షలను నివారించింది. వలసవాద నిర్మూలనకు సోషలిస్టు విప్లవాలు సహకరించాయి. చైనా, క్యూబా, వియత్నాంలలో విప్లవాలు వర్థిల్లాయి, సామ్రాజ్యవాద ఆయుధ పోటీని నివారిస్తున్నాయి.


నేడు భారతదేశంలో కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు. మతోన్మాదం పేట్రేగిపోతోంది. ప్రభుత్వరంగసంస్థల్ని బూర్జువా పెట్టుబడిదారులు కబళిస్తున్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. పారిస్‌ కమ్యూన్‌ విప్లవం, ప్రపంచ విప్లవాల చరిత్ర నుండి నేర్చుకొన్న పాఠాల ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో నూతన ఎత్తుగడలు వ్యూహాలు రచించవల్సిన బాధ్యత ప్రపంచ శ్రామిక వర్గంపైనా, రైతాంగంపైన కార్మిక కర్షక పార్టీల పైనా ఉంది.

0 comments

Comments


bottom of page