top of page

వాక్‌ స్వాతంత్ర్యానికి కొత్త సవాలు

Updated: Mar 12, 2021

పధ్మజా షా, former HOD, Journalism department, Osmania University


క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలాగా ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యాన్ని 2014కి పూర్వం, 2014 తరవాతగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. 2014కు పూర్వం సమాచార, ప్రసార మాధ్యమాలపై ఆధిపత్యం కోసం దేశంలో రాజకీయంగా ఇంత పెద్ద స్థాయిలో బహిరంగ యుద్దాలు జరగలేదనే చెప్పాలి. దీనికి ఆన్‌లైన్‌ మధ్యమాల ప్రాధాన్యత విపరీతంగా పెరగటం, 130 కోట్ల జనాభా దగ్గర దాదాపు 100 కోట్ల పైగానే మొబైల్‌ ఫోన్లు ఉండటం, వాటిల్లో సగానికి పైగా ఇంటర్నెట్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్ను కావటం కూడా కారణమే.


నిమిషాల్లో కాకుండా సెకండ్లల్లో సమాచారం దూరదూరాలకు చేరుతున్న కాలం. ఇందులో సరైన సమాచారం సగం అయితే, అబద్ధ ప్రచారాలు, విద్వేషాలని రెచ్చగొట్టే ప్రచారాలు పెద్ద ఎత్తునే ఉంటున్నాయి. 2014లో, తరవాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల గెలుపు వెనక సోషల్‌ మీడియా భారీ ఫ్యాక్టరీల పాత్ర వుందని అందరికి ఇప్పటికే అర్ధం అయ్యింది. అమిత్‌ షా తమ సోషల్‌ మీడియా యోధులతో మాట్లాడుతూ, వాళ్లు చేసిన విష ప్రచారాల వల్ల, బెదిరింపు పోస్టుల వల్లనే ఎలెక్షన్లు గెలుస్తున్నామనే అర్థం వచ్చేట్లుగ మాట్లాడాడు. అంతేకాదు, మందపహాసంతో ఇక ముందు కూడా ఆవిధంగానే శ్రద్ధగా పనిచేయమని ప్రోత్సహించటం కూడా యూట్యూబ్‌ వీడియోల్లో చూడొచ్చు.


స్వాతి చతుర్వేది ఇన్వెస్టిగేషన్‌ చేసి రాసిన ఐ యాం ఎ ట్రోల్‌ పుస్తకంలో ఏ విధంగా అతి తక్కువ జీతానికి 18-20 ఏళ్ల పిల్లల చేత అబద్ధ ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద ద్వేషపూరితమైన, బెదిరింపులు, హింసతో కూడిన విష ప్రచారాలు చేయిస్తున్నారో వివరిస్తుంది. ఈ సెంటర్లలో పని చేసి బయటికి వచ్చిన వాళ్లు కొందరు కూడా తమ అనుభవాలను గురించి బహిరంగంగానే చెప్పుకున్నారు.


ఆన్‌లైన్‌ మాధ్యమాలని ఎంత అసాంఘికంగా వాడుకోవచ్చో బాగా అవగాహన ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్‌ మాధ్యమాలని నియంత్రించే పని మొదలు పెట్టింది. జనం తెలివి మీరి, సరైన సమాచారాన్ని గుర్తించగలిగే శక్తిని పెంచుకుంటున్నారు. విషప్రచారాలని ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారానే పెద్ద ఎత్తున వ్యతిరేకించటం నేర్చుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాగా విస్వసనీయత ఉన్న పార్తీకేయులు కొందరు మెయిన్‌ స్ట్రీం మీడియాని ఒదిలి స్వతంత్రమైన ఆన్‌లైన్‌ మీడియాని స్థాపించు కున్నారు. ఈ ప్రయత్నాల వల్ల ప్రధాన స్రవంతి మీడియాలో ప్రచురణ కాలేని వార్తలు ఎన్నో ఆన్‌లైన్‌ మీడియాలో వస్తున్నాయి. అడ్వర్‌‌టైజ్‌మెంట్ల ద్వారా, ఇతర ఒత్తిడుల ద్వారా మెయిన్‌ స్ట్రీమ్ ‌మీడియాని అదుపులో పెట్టిన ప్రభుత్వాలకి ఆన్‌లైన్‌ మీడియాని నియంత్రించక పోతే రాజకీయంగా ప్రమాదమని అర్ధం అయ్యింది.


అందులో భాగంగానే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లయున్స్ అండ్‌ ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌ 2021ని 25 ఫిబ్రవరి నాడు కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాష్‌ జవదేకర్లు ఒక విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.


ఈ గైడ్‌లైన్ల ప్రకారం సిగ్నిఫికెంట్‌ ఇంటర్మీడియరీస్‌, అంటే పేస్బుక్‌, ట్విట్టర్‌, ఇంస్టాగ్రామ్‌ వంటి పెద్ద కంపెనీలు; ఇంటర్మీడియరీస్‌ అంటే అటువంటి ఇతర చిన్న కంపెనీలు; నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ ఫ్లాట్‌ఫార్మ్స; ది న్యూస్‌ మినిట్‌, న్యూస్‌ లాండ్రీ వంటి ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ - అన్ని కూడా ప్రభుత్వ నియంత్రణ కిందికి వస్తాయి. ముఖ్యంగా వార్తా సంస్థల గురించి మాట్లాడుకుంటే, గత కొన్ని ఏళ్లుగా ఆన్‌లైన్‌లో విశ్వసనీయమైన సంస్థలు చాల వొచ్చాయి.

న్యూస్‌ పేపర్లు, టీవీ చాన్నాళ్ల లాంటి సంప్రదాయక వార్తా మాధ్యమాలు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, ప్రభుత్వ వొత్తిడులకైతేనేమి, బడా పెట్టుబడిదారులు, కొనివేయటం వల్లనైతేనేమి - ముఖ్య విషయాలని నిష్పాక్షికంగా కవర్‌ చేయలేక పోయాయి. పక్క విషయాల మీద చర్చలు ఎక్కువ చేసి అసలు విషయాలను పక్కకు నెట్టేశాయి. ఆన్‌లైన్‌ సంస్థలే క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌ బలంగా చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, జర్నలిజం విలువని నిలబెట్టాయి. అల్ట్ న్యూస్‌కి చెందిన ప్రతీక్‌ సిన్హా సంస్థను పెట్టి నందేహాన్సదంగా ఉన్న ప్రతి రిపోర్ట్‌, ప్రతి ఫోటోని వాటి విశ్వవశనీయతని ఎట్లా పరిశీలించాలో, ఎట్లా ప్రశ్నించాలో మనకి నేర్పారు. ఫేక్‌న్యూస్‌ విసృతంగా ప్రచారం అవుతున్న సమయంలో ఇది చాలా ముఖ్యమైన పరిణామం.


ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో మన ముందుకి వచ్చిన కోడ్‌ అఫ్‌ ఎథిక్స్‌ గురించి పలు రకాల అభిప్రాయాలు ముందుకి వస్తున్నాయి. రాజ్యాంగం 19(1)() కింద ఉన్న వాక్‌ స్వాతంత్ర్యం హక్కు దృష్ట్యా ఎప్పుడూ వార్తలని నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వాలు ప్రెస్‌కౌన్సిల్‌కి, అమలులో ఉన్న చట్టాలకు, స్వీయనియంత్రణ ప్రక్రియలకి ఒదిలివేశాయి. కంటెంట్‌ నియంత్రణ ప్రక్రియ గురించిన నిర్ణయాలు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది, కానీ ఇప్పుడు ప్రకటించిన కోడ్‌ ఐటీ ఆక్ట్‌ కింద ఉంది. అందువల్ల సంబంధిత ఆక్ట్‌ లేకుండా, పరిధిలో లేని విషయాల మీద రూల్స్‌ చేయటంతో దీనికి లీగల్‌ బేసిస్‌ లేదని అంటున్నారు. డిజిపబ్‌ సభ్యులు ఈ కోడ్‌ ద్వారా వార్తలని లీగల్‌ ఫ్రేంవర్క్‌ నుంచి, 19(1)(4) రక్షణ నుంచి తప్పించి ప్రభుత్వ నియంత్రణ కిందికి తెచ్చే ప్రక్రియ అని వర్ణించారు.


కోడ్‌లో వార్తా సంస్థలు మొదటగా న్వీయ నియంత్రణ చేసుకోవాలి, రెండవ స్థాయిలో గ్రూపుగా స్వీయ నియంత్రణ ప్రక్రియ రూపొందించుకొని పాటించాలి, ఆఖరుగా ప్రభుత్వం పాత్ర ఉంటుంది అని ఉంది. ప్రభుత్వం అంటే అథరైడ్జ్‌ ప్రభుత్వ అధికారులు అని, చట్టపరంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులకి, అధికారుల ఆదేశాలకి ఉన్న తేడా అందరికి తెలిసినదే. అధికారుల ఆదేశాలకు మీడియా నియంత్రణని లోబరుస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు.


పేరెంట్‌ ఆక్టు అయిన ఐటీ ఆక్ట్‌లో వార్తల కరెంటు అఫైర్స్‌ ఊసు గాని, నిర్వచనం గాని లేదు. ఐటీ ఆక్ట్‌ కేవలం ప్లాటుఫార్మ్స‌, అంటే ఫేస్బుక్‌, ట్విట్టర్‌ లాంటి సంస్థల పని తీరు, దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకుండా ఉండే రీసోనబుల్‌ రెస్ట్రిక్షన్స్‌ గురించి చెప్తుంది. వార్త సంస్థలకి సంబందించిన కోడ్లు, చట్టాలు ఎన్నో ఏళ్లుగా అమలులో వున్నాయి. వాటిని సమానంగా పాటించకపోవడం ఒక పెద్ద వైఫల్యం. సంస్థలు స్వీయ నియంత్రణ చేయలేక పోవటం కూడా ఒక పెద్ద వైఫల్యమే. అయితే ఇప్పటి కోడ్‌ ద్వారా ప్రభుత్వం తనకు నచ్చని కంటెంట్‌ని తొలగించటానికి, పోర్టల్స్‌ని కొన్ని రోజుల పాటు సస్పెండ్‌ చేయటానికి, పూర్తిగా మూసివేయటానికి అధికారాలు పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎత్తుగడ ప్రకారం అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయి. న్యాయ ప్రక్రియ ద్వారా కాదు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి, వాక్‌ స్వాతంత్ర్యానికి, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కుకి తీవ్రమైన విఘాతం కలుగుతుంది.


ఈ ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ అన్ని కూదా ఇప్పుడు డిజిపబ్‌ అనే గ్రూవుగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఆన్‌లైన్‌ పోర్టల్ని నియంత్రించేందుకు తలపెట్టినప్పుడు డిజిపబ్‌ గ్రూప్‌ ప్రభుత్వానికి తమతో కూడా చర్చించాలని ప్రతిపాదించాయి. కానీ అట్లా చేయకుండానే ప్రభుత్వం ఈ కోడ్‌ అఫ్‌ ఎథిక్స్‌ని ఐటీ ఆక్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరిగిన విలేకరుల సమావేశంలో స్టేక్‌ హోల్దర్స్‌ అయిన న్యూన్‌ పోర్టల్స్‌తో సంప్రదించారా అని పదే పదే అడిగిన ప్రశ్నకు జావదేకర్‌ ఆ సంస్థలు ఏవో మాకు తెలియదు, చాల ఉన్నాయి కదా అని సమాధానం ఇచ్చారు. అప్పటికే డిజిపబ్‌ రాసిన ఉత్తరం ఇద్దరు మంత్రులకు చేరింది.


అంటే ఈ కోడ్‌ను ఎవరితోనూ సంప్రదించకుండానే ప్రభుత్వం రూపొందించిందని అర్ధం అవుతుంది. ఎన్‌డీటీవీ డిబేట్‌లో పాల్గొంటూ (27 ఫిబ్రవరి), ప్రముఖ సుప్రీమ్‌ కోర్ట్‌ న్యాయవాది మేనకా గురుస్వామి ప్రపంచంలో అన్ని పెద్ద ప్రజాస్వామ్యాల్లో గత సంవత్సరం పార్లమెంట్లు 140 రోజులకు తక్కువ నడవలేదు, కేవలం మన దేశంలో కోవిద్‌ నెపంతో కష్టం మీద 70 రోజులు నడిపారు అని అన్నారు. అతి ముఖ్యమైన చట్టాలని, విధానాలని, ఏ చర్చలు, సంప్రదింపులు లేకుందా ఏకపక్షంగా నిర్ణయించటం తగదని, ఈ ఐటీ ఆక్ట్‌ కోడ్‌ అఫ్‌ ఎథిక్స్‌ కూడా ఆ కోవకు చెందినవే అని అన్నారు.


వార్తా సంస్థలే కాకుండా పలు పోర్టల్స్‌ కూడా ఈ కోట కోడ్‌ కిందికి వస్తాయి. సినిమాలైతే సెన్సార్‌షిప్‌ లోబడి వుండాలి. OTT ష్లాటుఫార్మ్‌కు ఆ నిబంధనలు లేకపోవటంతో ఒక కొత్త సృజనాత్మకతతో చాల ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఈమధ్య వచ్చాయి. జనంలో చాల ఆదరణ కూడా పొందాయి. స్వేచ్ళగా చేసినవి కావటంతో సాంస్కృతికంగా, రాజకీయంగా ఒక ఓపెన్‌ డిబేట్‌ని లేవనెత్త గలిగాయి. చాలామంది కొత్త కళాకారులకి, రచయితలకి, దర్శకులకి మునుపెన్నడూ లేనన్ని అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో, అమెజాన్లో వస్తున్న తాండవ్‌ సిరీస్‌

మీద ఉన్న కోర్టు కేసుల్ని బట్టి చూస్తే ఈ ఒరవడిని అదుపులో పెట్టాలనే ఆత్రుత కూడా కనబడుతోంది.


ప్రభుత్వం రీజనబుల్‌ రెస్ట్రిక్షన్స్‌ కింద ఇప్పుడు కూడా దేశ రక్షణకి భంగం కలిగించే, పిల్లలకి హాని కలిగించే ప్రోగ్రామ్స్‌ని అమలులో ఉన్న చట్టాల ద్వారా నియంత్రించవచ్చు, నిబంధనలు కూడా చేయవచ్చు. కానీ నిబంధనల పేరిట మళ్లీ ఇండస్ట్రీని పాత మూసలోకి నెట్టకుండా ఉంటే కొత్తగా పైకి వస్తున్న సృజనకు ప్రోత్సాహకంగా ఉంటుంది.


మొత్తానికి ఈ కొత్త కోడ్‌ అఫ్‌ ఎథిక్స్‌ గురించి ఇంకా చాల చర్చ అవసరం.

0 comments

Comentários


bottom of page